రామవరం, జూలై 17 : పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని షీ టీమ్, మానవ అక్రమ రవాణా నియంత్రణ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని నేతాజీ రామవరం ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టం, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. వాటిని నివారించడంలో షీ టీమ్, మానవ అక్రమ రవాణా, పోలీస్ భరోసా, చైల్డ్ హెల్ప్ లైన్ పాత్రను తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ బృందం పనిచేస్తుందని, ఎలాంటి సమయాల్లోనైనా మహిళలపై, పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మహిళలు, పిల్లలను ఎవరైనా, ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టినా షీ టీమ్ ని నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడుతాయన్నారు. ఫిర్యాదుకు కొత్తగూడెం షీ టీమ్ ఫోన్ 87126 82131కి, చైల్డ్ లేబర్స్, చైల్డ్ బెగ్గర్స్, మిస్సింగ్ చిల్డ్రన్, స్కూల్ డ్రాప్ ఔట్స్ 1098 కి కాల్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, హెడ్ కానిస్టేబుల్ నాగయ్య, కానిస్టేబుల్ రాంబాబు, హోంగార్డ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.