రామవరం, సెప్టెంబర్ 04 : తెలంగాణ విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ పాలసీ కమిటీలో ముస్లిం విద్యావంతులకు స్థానం కల్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ విద్యా విధానాన్ని అమలు చేయడంలో, ఉద్యోగ అవకాశాలు, విద్యా నైపుణ్యం, డిజిటల్ విద్యా విధానం, కొత్త ఆవిష్కరణలు వంటి పలు అంశాలు అధ్యయనం చేయడానికి చైర్ పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను నియమించగా, ముస్లిం వర్గానికి చెందిన ఏ ఒక్కరికి కూడా స్థానం దక్కలేదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 14 శాతం ముస్లిం జనాభా ఉండడం, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ద్వితీయ భాషగా ఉర్దూ చలామణి అవుతుండడంతో రాష్ట్రంలోని ముస్లిం విద్యావంతులకు అవకాశం కల్పిస్తే, మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా ముస్లిం సమాజం కూడా సాంకేతిక లక్ష్యాలను అందిపుచ్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. ముస్లిం సమాజం ముందుకు పోవాలంటే ముస్లిం విద్యావంతులకు ఎడ్యుకేషన్ పాలసీ కమిటీలో అవకాశం కల్పిస్తే, తద్వారా రాష్ట్ర ముస్లిం యువతకు దోహదకారి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.