చండ్రుగొండ, మార్చి 31: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చండ్రుగొండ మండలంలో ఈద్గాల వద్ద నల్ల బ్యాడ్జీలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలు, వక్స్ బోర్డుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో తీసుకువచ్చే బిల్లును దేశంలోని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా చండ్రుగొండ, తిప్పనపల్లి, మహ్మద్ నగర్ గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మతాలవారీగా చిచ్చు పెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీన పరుచుకునే కేంద్ర నిర్ణయాలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మసీద్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.