ఇల్లెందు, ఆగస్టు 20 : గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలో వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. బుధవారం ఇల్లెందు మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్తో కలిసి అన్ని వార్డుల్లోని సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు. వార్డు ఆఫీసర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చాలన్నారు. తాగునీటి సౌకర్యం, విద్యుత్, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ మురళి, మున్సిపల్ మేనేజర్ అంకుశావలి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.