తెలంగాణలో విద్యుత్‌శాఖకు సంబంధించిన కీలక విభాగానికి అధికారి ఆయన. ఆ పోస్టు కోసం చాలా మంది పోటీపడినా చివరకు అనేక పైరవీల మధ్య ఆ పోస్టును గత సంవత్సరం ఆ అధికారి దక్కించుకున్నారు. సంబంధిత శాఖా మంత్రి అండదండలతో గత ఆగస్ట్‌లో తన మాతృశాఖ నుంచి సంవత్సర కాలంపాటు డిప్యుటేషన్‌పై ఈ విభాగానికి వచ్చారు. అక్కడ ఆయన జీతం ఆరు లక్షలయితే.. అంతేజీతంతో ఈ విభాగంలోనూ కొనసాగుతున్నారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)
ప్రభుత్వ పరంగా సీనియర్ ఐఏఎస్‌లకు కూడా అంతజీతం లేదు. దీంతో ఆయన జీతాన్ని ఎలా చెల్లించాలనే సందిగ్ధంలో పే అండ్ అకౌంట్స్ విభాగం తర్జనభర్జన చేసి చివరకు అలవెన్స్‌లు కాకుండా జీతాన్ని చెల్లించడానికి రెండుమూడురోజుల కిందటే ఒప్పుకొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ జీతం లేకుండా ఈ ఆరు నెలలు ఎలా పనిచేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తే ఆయన జీతం కంటే గీతమే ఎక్కువని ఆ విభాగంలో గుసగుసలాడుకుంటున్నారు. ప్రతీవారం సుమారు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కలెక్షన్ ఉండడంతో ఆ సీటుకు ప్రాధాన్యత ఎక్కువని, అందుకే గత ఏప్రిల్ నుంచి ఆ పదవి దక్కించుకోవడానికి చాలామంది సీరియస్‌గా ప్రయత్నించినా చివరకు ఈ అధికారికే అదృష్టం దక్కిందని ఆఫీసు మొత్తం కోడై కూస్తున్నది. ఈ నేపథ్యంలో సదరు అధికారి తాను సీటులో కూర్చున్నప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు వందలకు పైగా ఫైల్స్ ఇన్స్పెక్షన్ చేసి క్లియర్ చేశారని, ఇందుకోసం పెద్ద ఎత్తునే వెనకేసుకున్నారని చెప్పుకొంటున్నారు.
మంత్రి అండదండలతోనే..!
సదరు శాఖకు చెందిన మంత్రి చలవతోనే ఈ అధికారి చీఫ్ పీఠం దక్కించుకున్నారంటూ ఆఫీసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. సదరు మంత్రి తెచ్చుకున్నందుకు ప్రతిఫలంగా ప్రతీవారం ఎంతో కొంత సమర్పించుకునేవరకు ఆయన నిద్రపోకుండా తనిఖీలు చేస్తూనే ఉంటారని అధికారితో ఇబ్బందులు పడుతున్న బాధితులతో పాటు లబ్ధిపొందిన వారూ అంటున్నారు. ఈ అధికారి వచ్చిన తర్వాత నకిలీల వ్యవహారం వెలుగుచూడగానే తన జేబులు నింపుకొనే ప్రయత్నం చేసి సక్సెసయ్యారు. ఒక కాంట్రాక్టర్ తనపై కేసు పెట్టకుండా ఉండేందుకు సదరు అధికారి అడిగిన నాలుగు లక్షలను మరో కాంట్రాక్టర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ద్వారా ఈ అధికారికి అందజేసినట్లు తెలిసింది.
ఇక బినామీ లైసెన్సుల చేయించడంలో ఆయనకు ఆయనే సాటి. తనకు తెలియని విషయంలో ఆయనకు సాంకేతికంగా సహకరిస్తున్న ఓ ఇంజినీర్ ద్వారా తెలుసుకుంటూ ఆయన నేతృత్వంలోనే మొత్తం దందా నడిపిస్తున్నారని కొందరు కాంట్రాక్టర్లు చెప్పారు. ముడుపులను ముట్టజెప్పడంలో ఆ అధికారి తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. రోజువారీ కలెక్షన్ మొత్తం ఒక దగ్గర పెట్టి వారాంతంలో వసూలు చేసిన మొత్తాన్ని ఒక బ్యాగులో పెట్టి తనకు నమ్మకస్తులైన వారి ద్వారా నగరంలోని కుషాయిగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో తాను చెప్పిన వ్యక్తికి అందజేస్తారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి వాటిని సదరు అధికారి చెప్పిన చోట అంటే డిప్యూటీకి కానీ, ఇతర ఉన్నతాధికారులకు కానీ ముట్టజెప్తారు. అందులో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా నోట్ల మిషన్ల ద్వారా కౌంటింగ్ కూడా చేయిస్తారంటూ ఆ శాఖకు సంబంధించిన వారంతా చెవులు కొరుక్కుంటున్నారు. తాను పంపిన డబ్బుల తాలూక లిస్ట్ ఎప్పటికప్పుడు తనవెంట ఉండే బ్యాగులో పెట్టుకుంటూ.. తన నమ్మకస్తుడైన అధికారి దగ్గర పెడుతున్నట్లు సమాచారం.
ఆర్డర్ లేకుండానే అన్నీ తానై..!
ఈ అధికారి తన నియామకానికి సంబంధించి ఉత్తర్వులు కూడా కేవలం మెమో రూపంలో వచ్చినప్పటికీ ఉత్తర్వులు లేకపోయినా సదరు శాఖ ముఖ్య నేతతో పాటు ఆయన సిబ్బందిని ప్రసన్నం చేసుకోవడంలో తన చేతివాటాన్ని పారిశ్రామికవేత్తలు, వినియోగదారులు, వ్యాపారులపై రుద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయనకు కేవలం ఒక పోస్టుకు సంబంధించిన డిప్యుటేషన్ ఉత్తర్వులే ఉండగా మిగతా డిప్యూటీలకు సంబంధించిన రెండు పోస్టులను కూడా కలుపుకొని మూడింటిని ముచ్చటగా చేస్తూ మూడు తనిఖీలు ఆరు ముడుపులుగా వ్యవహారం చేస్తున్నారంటూ పలువురు చెప్పుకొంటున్నారు.
తన సాంకేతిక డిప్యూటీ సహాయకుడితో కలిసి తన సొంత రాష్ట్రంలోని ప్రధాన నగరానికి చెందిన ఓ మహిళ పేరుపై నగరంలోని అమీర్‌పేట నుంచి బినామీ లైసెన్స్ తీసుకోవడం ద్వారా తనకు ఇరవై లక్షలకు పైగా లాభం వచ్చే పని చేసుకున్నారని, దీనిపై సీఎం వరకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు ఈ పదవి కట్టబెట్టిన మంత్రి డ్రైవర్ బావమరిదికి కూడా ఒక లైసెన్స్ ఇచ్చి ఆయనకు సబ్జెక్ట్ తెలియకున్నా.. ఏకంగా పనుల మీద పనులు చేయిస్తూ తనకు కొంత, సార్‌కు కొంత, డ్రైవర్‌కు కొంత అన్న నిష్పత్తిలో దందా చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆ నేత ఇంటికి సంబంధించిన డ్రైవర్ అడపాదడపా కార్యాలయానికి వచ్చి ఫైల్స్ చెక్ చేసుకోవడం, తనకు అవసరమైన పనులు చేసుకుని వెళ్లడం, అధికారికి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్న సాంకేతిక ఇంజినీర్‌తో లావాదేవీలు చేస్తున్నట్లుగా డిపార్ట్మెంట్ మొత్తం చెప్పుకుంటున్నారు.
సదరు అధికారికి మంత్రి కార్యాలయ సిబ్బందితో పాటు తమ శాఖ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయని చెప్పుకుంటారని, అవసరమైతే వారితో చెప్పి ఎవరినైనా ఎక్కడికైనా పంపించేయగలనని అంటారని, అంతేకాకుండా తన పోస్ట్ ఓ ఐఏఎస్ స్థాయి కాబట్టి తాను కూడా వారితో సమానమంటారని కార్యాలయ ఉద్యోగులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అధికారి తన వద్ద భాగ్యనగర సర్కిల్లో పనిచేస్తున్న మరో అధికారికి సంబంధించిన వ్యవహారంలోనూ అతనికి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని సచివాలయం స్థాయిలో చర్చ జరిగింది. ఈ అధికారి గురించి తన మాతృకంపెనీలో ఉంటే వచ్చే జీతం ఇక్కడ రాకపోయినా ఆపోస్టులో మిగతామార్గాలతో వచ్చేదానితో సంతృప్తికరంగా ఉన్నానని చెప్పుకుంటూనే తనకు సహకరించిన మంత్రిని ప్రతీవారం సంతృప్తిపరచడమే ఈ సంవత్సర లక్ష్యమంటున్నట్లు విద్యుత్ శాఖలో ప్రత్యేకించి మింట్‌కాంపౌండ్‌లో, ఏసీగార్డ్స్‌లో చర్చ జరుగుతున్నది.