Mukkanti Temple | జూలూరుపాడు, ఫిబ్రవరి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలోని కాకతీయుల కాలం నాటి అతి పురాతన చరిత్ర కలిగి స్వయంభుగా కొలువుదీరిన శ్రీ ఉమా సోమ లింగేశ్వర స్వామి ఆలయాన్ని శివరాత్రి పండుగకు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధల నడుమ భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బుధవారం జరగనున్న పండుగను అంగరంగ వైభవోపేతంగా భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వారం రోజుల ముందు నుండే ఆలయంలో అలంకరణ పనులను ప్రారంభించారు.
ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేయడానికి గతంలో భారీ సంఖ్యలో రావడాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లను చేశారు.
కనుల పండుగలా..
ఈ ఆలయంలో కాకతీయుల కాలం నాటి పురాతన శివలింగం, నందీశ్వరుడు, భక్తాంజనేయ స్వామి, నవగ్రహాలు, గణపతి, ఉమాదేవీల విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. శివరాత్రి నాడు శివపార్వతుల కల్యాణం ఊరేగింపును కనుల పండుగలా నిర్వహించేందుకు కమిటీ నిర్వాహకులు పనులను పూర్తిస్థాయిలో చేపట్టారు.
మండలంతోపాటు ఇతర ప్రాంతాల నుండి ఈ ఆలయానికి ప్రతి ఏటా భక్తుల రద్దీ ఉండడంతో.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కమిటీ సభ్యులు ముందస్తుగా సకల సౌకర్యాలను ఏర్పాట్లు చేశారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!