– ఏప్రిల్ 2కి సంత వేలం వాయిదా
బూర్గంపహాడ్, మార్చి 30 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి గాను వారాంతపు సంత, పశువుల సంతకు సంబంధించి సోమవారం నిర్వహించిన సంత వేలంపాట రసాభాసగా జరిగింది. తొలుత ఎంపీడీఓ జమలారెడ్డి సంత వేలంపాటకు సంబంధించిన ప్రభుత్వ మద్దతు ధర రూ.34 లక్షలుగా నిర్ధారించి వేలంను నిర్వహించారు. వేలంపాట సమయంలో కొందరు వ్యాపారులు సంత నిర్వహించిన సమయంలో అధిక ధరలు వసూలు చేశారని అభ్యంతరం తెలిపారు. దీనికి అధికారులు వ్యాపారులకు సర్దిచెప్పి ఈసారి అలా జరగకుండా చూస్తామని చెప్పి తిరిగి వేలంపాటను నిర్వహించారు. ఈ వేలంపాటలో ఏడుగురు పాటదారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయానికి రూ.33.81 లక్షలకు పాటదారుడు వేలం పాడగా అధికారులు మూడవసారి అని చెప్పి వెంటనే ప్రభుత్వ మద్దతు ధర రాలేదని మళ్లీ తిరిగి సాయంత్రం 3 గంటలకు పాట కొనసాగుతుందని చెప్పి వేలంపాటను అర్ధాంతరంగా ముగించారు. తిరిగి వేలంపాటను నిర్వహించగా పాటదారులు ఆసక్తి చూపకపోవడంతో పాటు ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో చివరకు వేలంపాటను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. మొదటి నుంచి చివరి వరకు వేలంపాట రసాభాసగానే సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు సర్పంచ్ బొర్రా సుభద్ర, ఉప సర్పంచ్ పొక్కుల రవి, సారపాక, మోరంపల్లిబంజర్, సోంపల్లి కార్యదర్శులు కంది మహేష్, భవానీ, వెంకటేష్, పాటదారులు బానోత్ రవీందర్, తేజావత్ విద్యాసాగర్, రాసా శ్రీను, కల్తీ స్వామి, భూక్యా రంజిత్‌నాయక్, కణితి జొర్రా కృష్ణ, గుగులోత్ కిషనానాయక్ పాల్గొన్నారు.
మండల పరిధిలోని సారపాక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ కిశోర్ నాయక్ అధ్యక్షతన వారాంతపు సంత వేలంపాటను సోమవారం అధికారులు నిర్వహించారు. ఈ సంత వేలంలో గత ఏడాది కంటే రికార్డు ధర పలికింది. గతంలో భూక్యా కృష్ణకుమార్ రూ.6.17 లక్షలకు సంత వేలం దక్కించుకోగా ఈ ఏడాది ధారావత్ మమత లక్ష అదనంగా రూ.7.25 లక్షలకు సంత వేలంపాటను దక్కించుకున్నారు. సంత వేలంలో 8 మంది పాటదారుల నుంచి పోటీ పెరగడంతో ఈ ఆదాయం లభించిందని తెలిపారు. ప్రస్తుతం సంత స్థలాన్ని జాతీయ రహదారి పక్కనే వరుణ్ మోటర్స్ సమీపంలోకి మార్చడంతో ఇబ్బందులు తలెత్తవని సర్పంచ్ కిశోర్ తెలిపారు. సంత వేలంపాటలో భాగంగా కూరగాయల సంతతో పాటు పశువుల సంత ఏర్పాటు చేయాలని ఈఓ మహేశ్ ప్రతిపాదించగా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో త్వరలో పశువుల సంత ఏర్పాటుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని పశువుల సంతను ప్రారంభిస్తామని తెలిపారు.
మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో వారాంతపు సంతకు సంబంధించి బూర్గంపహాడ్, పినపాక పట్టీనగర్ కార్యదర్శులు బర్ల ప్రభాకర్, విజయు సోమవారం వేలంపాట నిర్వహించారు. వారాంతపు సంత వేలంతో పాటు మూడు షాపులకు వేలం నిర్వహించారు. సంత వేలానికి సంబంధించి ఐదుగురు పాటదారులు పోటీపడగా జక్కం నాగేశ్వరరావు రూ.3 లక్షలకు దక్కించుకోగా గత ఏడాది జక్కం శ్రీనివాసరావు రూ.2.54 లక్షలకు సంతను దక్కించుకోగా ఈ ఏడాది రూ.44 వేలు అదనపు ఆదాయం వచ్చింది. అయితే మూడు షాపులకు సంబంధించి ఎవరూ ఆసక్తి చూపకోవడంతో షాపుల వేలం ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. ఈ సంత వేలం సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న సమక్షంలో నిర్వహించారు.