కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 18 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోలో భాగంగా పేదింటి యువతులకు లక్ష నూట పదహారు రూపాయలతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ప్రస్తుతం తులం బంగారం ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగానే ఉందని కుండ బద్దలుకొట్టారు.
కొత్తగూడెం నియోజక వర్గ అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాబోతుందని తద్వారా ఆనేక మందికి ఉన్నత విద్యతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాజీవ్ యువ వికాసం కోసం ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, అవినీతికి తావు లేకుండా అర్హులకే అందజేసేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిదేవిపల్లి తహసీల్దార్ కే ఆర్ కే వీ.ప్రసాద్, కొత్తగూడెం నాయబ్ తహసీల్దార్ ఆమ్జాద్ పాషా, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆర్ఐలు సూర్యనారాయణ, శివ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.