రామవరం, జూన్ 29 : అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దూరమవుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు రూ.2 లక్షల ఆదాయ పరిమితి గతంలో ఉండేదన్నారు. కాగా 2022లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోని మైనారిటీ విద్యార్థులకు కూడా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆదాయ పరిమితిని 2 లక్షలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందన్నారు.
అయినప్పటికీ ఈ-పాస్ పోర్టర్ లో విద్యార్థులు ఉపకార వేతనాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి ఉన్న వారికి ఆన్లైన్ స్వీకరించడంలేదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి పొరపాటును సరిదిద్ది రూ.1.50 లక్షలు ఉన్న ఆదాయ పరిమితిని అర్హులుగా ప్రకటిస్తూ వెంటనే ఈ-పాస్ పోర్టల్ లో మార్పులు చేసి గడువు తేదీని 10 రోజులు పొడిగించాలని కోరారు.