– సీతారామ ప్రాజెక్ట్‌తో ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేకపోయిన ప్రభుత్వం
– రైతుల నోట్లో మట్టి కొట్టిన ఎమ్మెల్యేలు
– ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులపై విచారణ చేపట్టాలి
– గాంధీ పథం రాష్ట్ర కన్వీనర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ధ్వజం
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 25 : సీతారామ ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు నీళ్లివ్వకుండా జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు నట్టేట మంచారని గాంధీ పథం రాష్ట్ర కన్వీనర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని సూర్య ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో, పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేసినట్లు తెలిపారు.
కానీ అధికారంలోకి వచ్చాక కొంతమంది ప్రజా ప్రతినిధులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, ఇతర మండలాల రైతులకు నీళ్లివ్వకుండా కుట్ర చేశారని, ఫలితంగా ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లా ప్రాంత రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియలోనూ తీవ్ర అన్యాయం జరిగిందని అర్హులు ఆరోపిస్తుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. డబ్బులు తీసుకుని ఇండ్లు కేటాయించారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. కడు పేదలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గాంధీ పథం సభ్యులు పోటీ చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా, పరిష్కారం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గాంధీ పథం జిల్లా కన్వీనర్ చింతల చెరువు గోర్షోం, నాయకులు సూరెడ్డి సందారెడ్డి పాల్గొన్నారు.