– యాజమాన్యానికి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ వినతి
బూర్గంపహాడ్, జూన్ 16 : తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల విభాగాల శాఖ ద్వారా నూతన వేతనాలపై జీవో 6ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కనీస వేతన చట్టాన్ని ఐటీసీ కర్మాగారంలో కూడా కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాలని కోరుతూ ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పాటి సోమిరెడ్డి ఐటీసీ కర్మాగారంలో హెచ్ఆర్ విభాగంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. నూతన వేతనాలను 1.06.2026 నుండి అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గతంలో ఉన్న కనీస వేతనాల నోటిఫికేషన్లు రద్దు చేయబడి, కొత్త వేతన రేట్లు అమలులోకి వచ్చాయని తెలిపారు. తెలంగాణ జీవో 6 ప్రకారం ఐటీసీ కర్మాగారంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనాలు తక్షణమే అమలయ్యేలా చూడాలని కోరారు. వీటితో పాటు వేతన వ్యత్యాస బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ సభ్యులు జి.ఉమామహేశ్వరరావు, మేకల శేషమ్మ, జే.రాజేశ్వరి ఉన్నారు.