జూలూరుపాడు, ఆగస్టు 12 : ప్రభుత్వ విద్య పరిరక్షణకై, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ సహాయ కార్యదర్శి షేక్ చాంద్ పాషా పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు షేక్ చాంద్ పాషా ఏఐఎస్ఎఫ్ శ్వేత ముఖ్య అతిథులుగా హాజరై అరుణ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆవిర్భావ సమావేశంలో షేక్ చాంద్ పాషా మాట్లాడారు. 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ ఉద్యమ స్ఫూర్తితో నేటి పాలకులు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, ప్రభుత్వ విద్య పరిరక్షణకై, అసమానతలతో కూడిన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పవన్, సాయి ధనుష్, రామ్ చరణ్, నవీన్, శివ పాల్గొన్నారు.