చుంచుపల్లి, జూలై 01 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి డి.వాసంతి అన్నారు. బుధవారం ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్.సతీష్ కుమార్తో కలిసి కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. ముందుగా రైటర్ బస్తి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి పాఠశాలల్లో నమోదు (ఎన్రోల్మెంట్) పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ సంయుక్త అక్షరాలను నేర్పించారు.
తదుపరి కొత్తగూడెం భవిత కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చుంచుపల్లి భవిత కేంద్రంలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంపై ఆరా తీసిన ఆమె, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు అందజేసిన టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM)ను తప్పనిసరిగా వినియోగించి బోధనను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం బాబు క్యాంపు ప్రాథమిక పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని గమనించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాబు క్యాంపులో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా విద్యాధికారి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి వారానికి మూడు గుడ్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.