బూర్గంపహాడ్, జూలై 06 : ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, బూర్గంపహాడ్ మండల ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని సీపీఎం నాయకులతో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో రోగుల వార్డుకు వెళ్లి అందుతున్న వైద్య సేవలు, వైద్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారిందని, 30 పడకల ఆస్పత్రి నూతనంగా నిర్మిస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా నేటికీ అతీగతి లేదని, డిప్యూటేషన్‌పై వచ్చిన వైద్యులతో వైద్యం అందించడం విచారకరమన్నారు. రెగ్యులర్ వైద్యులు, సిబ్బందిని తక్షణమే నియమించాలని, నూతన ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం నేపధ్యంలో గోదావరి వరద ముంపు పొంచి ఉన్నందున ఆస్పత్రి చుట్టూ ప్రహరీని నిర్మించాలని, ఆస్పత్రిలో ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ముక్కంటి వెంకటేశ్వరరావును కలిసి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ప్రభుత్వానికి నివేదించాలని, నూతన ఆస్పత్రి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి రోగులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, పాండవుల రామనాథం, రాయల వెంకటేశ్వర్లు, వై.అప్పారావు పాల్గొన్నారు.