కొత్తగూడెం ప్రగతి మైదాన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన 86 మంది సభ్యులు లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ చేయుత’ కార్యక్రమానికి ఆకర్షితులైన ఎంతోమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతున్నారని తెలిపారు.
హింసాత్మకమైన నక్సలిజాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛయుత జీవితాన్ని గడిపేందుకు చత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయినట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన వారిలో 85 మంది బీజాపూర్ జిల్లాకు చెందిన వారు కాగా, ఒకరు సుకుమా జిల్లాకు చెందినవారు ఉన్నట్లు చెప్పారు.
కాగా భద్రాద్రి జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయిన వారిలో ఒక ఏరియా కమిటీ మెంబర్, ముగ్గురు పార్టీ సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు, 8 మంది కమిటీ సభ్యులు, 20 మంది డీఏకేఎంఎస్- కేఎంఎస్ సభ్యులు, 13 మంది చైతన్య నాట్య మండలి సభ్యులు, 9 మంది గ్రామ రక్షక దళం సభ్యులు ఉండగా.. ములుగు జిల్లా పోలీసుల ఎదుట ముగ్గురు ఏరియా కమిటీ సభ్యులు, ఒక పార్టీ సభ్యుడు, ఒక మిలీషియా కమాండర్ ఉన్నట్లు ఐజీ తెలిపారు. వీరంతా మావోయిస్టు పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాలపై అసంతృప్తి కలగడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరావాస పథకం కింద అందిస్తున్న ప్రతిఫలాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
ఏడాదిలో జిల్లాలో వివిధ స్థాయిల్లో పనిచేసిన 224 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసినట్లు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే వీరందరికీ ప్రభుత్వ ప్రయోజనాలను అందించినట్లు చెప్పారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నేరుగా లేదా బంధువులు, స్నేహితుల ద్వారా ముందుకు రావచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు, ములుగు ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, ప్రోబేషనరీ ఐపీఎస్ కొట్టె రుత్విక్ సాయి, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్లు కమల్ వీర్, ప్రీత, 81వ బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ హిమాన్షు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.