టేకులపల్లి, జూన్ 16 : విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాస్తండా గ్రామ పంచాయతీ రేగులతండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రేగులతండా గ్రామానికి చెందిన తేజావత్ కిషన్ (56) స్నానానికి వెళ్లి బట్టలను ఇనుప దండెంపై ఆరేశాడు. దండేనికి విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వాళ్లు చూసేసరికి కిషన్ మృతిచెంది పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించి, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.