జూలూరుపాడు, ఆగస్టు 25 : ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మంగళవారం జూలూరుపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వినోభానగర్ గ్రామానికి చెందిన బోడా నాగయ్య (45) మంగళవారం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కాల్వ వద్దకు చేపల వేట కోసం వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి ప్రవాహంలో పడిపోయాడు. గమనించిన సమీప వ్యవసాయ కూలీలు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో నాగయ్యను కాల్వలో నుండి బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్‌లో జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగయ్యకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.