రామవరం, మే 31 : సింగరేణిని దేశంలోనే అత్యున్నతమైన సంస్థగా తీర్చిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని నూతనంగా రూ.7.66 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఏరియా వర్క్ షాప్, ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ బలరాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగూడెం ఇల్లందు గోలేటి ఏరియాలో కొత్తగనులు ప్రారంభించినట్లు తెలిపారు. 22 మిలియన్ టన్నుల బొగ్గు తీసి తద్వారా సింగరేణి లక్ష్యసాధనలో మరో అడుగు ముందుకు పడనుందన్నారు.
పూర్తి స్థాయిలో సింగరేణిని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెట్టనున్నమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిటికల్ మినరల్స్ ఇతర మినరల్స్ స్టడీ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సింగరేణి సంస్థను విస్తరిస్తామన్నారు. కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సింగరేణిని విస్తరిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, భవిష్యత్తులో సింగరేణి సంస్థ మరింత ముందుకు దూసుకుపోతుందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగితే రూ.కోటి బీమా చేయించడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. కార్మికుల రక్షణ సింగరేణి సంస్థ ప్రధాన లక్షమని, ఆ తర్వాతే ఏదైనా అని వెల్లడించారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ మాట్లాడుతూ సింగరేణి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. సింగరేణి ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న బొగ్గుతో దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు సిమెంట్, స్పాంజ్ ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, సిరామిక్స్, ఫార్మా తదితర 2వేల కంపెనీల మనుగడ కోసం అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధికి బాటలు వేస్తోంది. సింగరేణి అంటే బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీగా చాలా ఏళ్లుగా గుర్తింపు ఉందని.. నేడు మనం చేపట్టిన వ్యాపార విస్తరణ చర్యలతో సింగరేణి కాలరీస్ అంటే థర్మల్ విద్యుత్ రంగంలోనూ, సోలార్ విద్యుత్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ తనదైన మార్క్‌ని చాటుతోందన్నారు. దేశంలోని బొగ్గు సంస్థల్లో థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టిన తొలి బొగ్గు కంపెనీగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి థర్మల్ ప్రాజెక్టు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు.
ఏరియా పరిధిలోని త్రీ ఇంక్లైన్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఏరియా వర్క్ షాపు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాల ప్రారంభోత్సవ సందర్భంగా సభాస్థలిపై ఏర్పాటుచేసిన బ్యానర్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించారు. దానికి ప్రోటోకాల్ పాటించారు కానీ స్థానిక శాసనసభ్యుడిని నా పొటో ఎందుకు పెట్టలేదు అంటూ సింగరేణి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ఇది రెండోసారి అని.. గతంలో 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఇదే విధంగా వ్యవహరించారని.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ తనను ప్రజాప్రతినిధిగా గుర్తించరా అంటూ ఆయన మండిపడ్డారు.