ఖమ్మం, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలను సాగు చేయగా తొలుత వర్షాల్లేక రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూశారు. కానీ ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేశాయి. పలు మండలాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా 9,282 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఖమ్మం వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. 78 గ్రామాల్లో 6,559 మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. వర్షాలకు జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, బొప్పాయి, కూరగాయల వంటి పంటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి.
కొన్ని మండలాల్లో పంటలు నేలవాలాయి. మరికొన్ని మండలాల్లో నీటిలో తడిసి ఇసుక మేటల్లో పేరుకపోయాయి. ఇంకొన్ని మండలాల్లో ముంపునకు గురయ్యాయి. రైతులు పంట నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వరి 5,358 ఎకరాల్లో దెబ్బతినగా 4,127 మంది రైతులు నష్టపోయారు. పత్తి 3,039 ఎకరాల్లో దెబ్బతినగా 1,897 మంది రైతులు నష్టపోయారు. మిర్చి 8 ఎకరాల్లో దెబ్బతినగా ఐదుగురు రైతులు నష్టపోయారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోనే సుమారు 5 వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారుల ప్రాథమిక నివేదిక చెబుతోంది. ఇవిగాక ఆరుతడి పంటలకు సైతం నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరద ఉధృతి తగ్గే వరకు పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, పంట నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, పంటల బీమా లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీపైనే రైతులు ఆధారపడుతున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నష్టపరిహారం చెల్లిస్తూ వస్తున్నది. అదే క్రమంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించనున్నది. కాగా, ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర, బోనకల్లు, కూసుమంచి, కామేపల్లి, తల్లాడ మండలాల్లో పంట నష్టం అత్యధికంగా జరిగినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలో గుర్తించారు.
రెండెకరాల్లో వరి పంట వేశాను. నాటు వేసిన నాలుగో రోజు వర్షం రావడంతో వరదతో పొలం నీటిలో ముగినిపోయింది 20 రోజులుగా నీటిలోనే పొలం ఉంది. వానకాలం పంట ఇక లేనట్లే. జాలివాగు వరద రావడంతో పంటకు నష్టం జరిగింది. సుమారు రూ.20 వేల పెట్టుబడి నష్టపోయాను. పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. మరో రూ.50 వేల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. వేసిన నారు పూర్తిగా కుళ్లిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
-మేకల వీరబాబు, రైతు, తురకగూడెం
నేను ఎకరం భూమిలో వరి పంట వేశాను. గత నెల 10వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షంతో వరద వచ్చి వరి పంట అంతా కొట్టుకుపోయింది. జాలివాగు వరదతో ఇసుక మేట వేసింది. వానకాలం రెండుసార్లకు కలిపి సుమారు రూ.20 వేల నష్టం వచ్చింది. జాలివాగు పక్కన సుమారు ఐదు ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మొదటిసారి వర్షానికి నారు కొట్టుకుపోగా.. రెండోసారి వాగు వరదకు ఇసుక మేట వేసింది. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఎంత నష్టం జరిగిందని రాసుకొని వెళ్లారు. ఇంకా డబ్బులు పడలేదు.
-కన్నెబోయిన లింగయ్య, రైతు, తురకగూడెం