(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : జీఎస్టీ 2.0 (వస్తు, సేవల పన్ను) ద్వారా సామాన్యులకు గొప్ప ప్రయోజనాలు తీసుకొచ్చామంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఊదరగొడుతున్నది. శ్లాబులతో పాటు ట్యాక్సులనూ తగ్గించినట్టు పైకి ప్రచారం చేసుకొంటున్న కేంద్రం ఇదే సమయంలో కనిపించని విధంగా కొన్ని భారీ వాతలకు తెగబడింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, మ్యాజిక్ పిన్ వంటి ఫుడ్, కిరాణా సర్వీసులను అందించే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందించే డెలివరీ సర్వీసులపై కేంద్రం తాజాగా 18 శాతం జీఎస్టీ విధించింది. ఈ నెల 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది. పెరిగిన డెలివరీ చార్జీలను కస్టమర్ల నుంచి ఆయా సంస్థలు వసూలు చేయనున్నాయి. అంటే, కేంద్రం తాజా నిర్ణయం అంతిమంగా వినియోగదారులపైనే భారాన్ని మోపిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహారానికి సంబంధించి బేస్ ప్రైస్‌తో పాటు ప్లాట్‌ఫాం ఫీజు, రెస్టారెంట్ చార్జీలు, డెలివరీ ఫీజు, ప్యాకేజింగ్ చార్జీలు, క్యాన్సలేషన్ ఫీజు, రెయిన్ ఫీజు, ట్రాఫిక్ ఫీజు పేరిట ఏవేవో పేర్లు చెప్తూ వినియోగదారుడి నుంచి ఇబ్బడిముబ్బడిగా చార్జీలను వసూలు చేసేవి. అయినప్పటికీ, నగరాల్లో పెరిగిన ట్రాఫిక్, సమయాభావం వంటి కారణంగా పెద్దయెత్తున ఆర్డర్లు వచ్చేవి. దీనికితోడు డెలివరీ చార్జీలపై ఇప్పటివరకూ జీఎస్టీ లేకపోవడంతో కస్టమర్లకు ఒకవిధంగా కొంత మొత్తంలో ఊరట దక్కేది. అయితే, కేంద్రం తీసుకొన్న తాజా నిర్ణయంతో.. డెలివరీ చార్జీలపై 18 శాతం జీఎస్టీ పడింది. అంటే, డెలివరీ యాప్స్ వసూలు చేసే డెలివరీ ఫీజుకు ఈ పన్ను అదనంగా చేరింది. అంటే, హోమ్ డెలివరీ సేవలు ఇప్పుడు మరింత ఖరీదుగా మారనున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఏదైనా ఈ-కామర్స్ సంస్థ గతంలో డెలివరీ ఫీజు రూ. 80గా వసూలు చేస్తే, ఇప్పుడు అది రూ. 94 వరకు (జీఎస్టీ 18 శాతంతో) చేరుకొంటుందని నిపుణులు చెప్తున్నారు.
‘డెలివరీ చార్జీలపై కేంద్రం 18 శాతం జీఎస్టీని విధించింది. డెలివరీ యాప్స్ ఈ భారాన్ని కస్టమర్లకే బదిలీ చేయవచ్చు. లేకపోతే, ఆహారం లేదా వస్తువులను డెలివరీ చేసే కెప్టెన్ల (డెలివరీ బాయ్స్) కమీషన్లలో కోత విధించవచ్చు’ అని ఓ ఫుడ్ డెలివరీ యాప్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, డెలివరీ చార్జీలపై జీఎస్టీ విధించడంతో ఆన్లైన్ ఆర్డర్లు తగ్గే ప్రమాదం ఉన్నదని గిగ్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతిమంగా తమ ఉపాధికే ప్రమాదకరంగా మారొచ్చని చెప్తున్నారు. పెంచిన జీఎస్టీని కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి బదులు.. తమ కమీషన్లలో కంపెనీలు కట్ చేసుకొంటే.. ఆర్థికంగా తామే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తన నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.
రోజూ వినియోగించే హెయిర్ ఆయిల్, సబ్బులు, ఫేస్ పౌడర్లు, శాంపూలు, టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్లపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి కుదించిన కేంద్రం.. అదే క్యాటగిరీకి చెందిన డిటర్జెంట్లు (బట్టల సబ్బులు, సర్ఫ్, లిక్విడ్), హెయిర్ డై వంటి కాస్మొటిక్స్‌పై జీఎస్టీని 18 శాతంగానే ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం తమకు షాక్‌ను ఇచ్చిందని పారిశ్రామికవర్గాలు పేర్కొంటున్నాయి. డిటర్జెంట్లపై జీఎస్టీని తగ్గిస్తే పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.