పాల్‌పేట, సెప్టెంబర్ 8 : గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులు ఆదివారం రాత్రి భోజనం చేసి వసతి గృహంలో నిద్రకు ఉపక్రమించారు. నిద్రలో ఉండగా ఎలుకలు వారి చేతులు, కాళ్లను కొరికాయి. నొప్పి రావడంతో ఏడుగురు విద్యార్థినులు నిద్ర నుంచి తేరుకుని జాగారం చేశారు. సోమవారం ఉదయం పాఠశాల సిబ్బందికి తెలిపారు.
కాగా నెలవారి హెల్త్ చెకప్‌లో భా గంగా ఆర్బీఎస్కేలు పాఠశాలకు రాగా.. సదరు విద్యార్థినులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు వారిని గోపాల్పేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత వారిని గురుకులానికి పంపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఆరోగ్యంను వివరణ కోరగా.. ఎలుకలు కరిచాయని విద్యార్థులు భయపడుతుండటంతో వారిని దవాఖానకు పంపించినట్టు తెలిపారు. విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ నాయకులు దవాఖానకు వద్దకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల నిర్వహణను గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని సూచించారు.