బీజింగ్ : చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ జియాంగ్యాంగ్ (30) అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన నాలుగేళ్ల వయసులోనే విద్యుదాఘాతం వల్ల రెండు చేతులను కోల్పోయారు. దీంతో వారి కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి తన వంతు సాయం చేయాలనే ఆలోచనతో ఎనిమిదేళ్ల వయసు నుంచి కాలిగ్రఫీ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. తన కాలి వేళ్లతో కాలిగ్రఫీ వర్క్‌ను విక్రయించి, కొంత సొమ్ము సంపాదించేవారు. లీ మీడియాతో మాట్లాడుతూ, జరిగినదానిని మార్చలేమని, తాను ముందుకు సాగక తప్పదని చెప్పారు. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.
పిల్లల్ని కిండర్‌గార్టెన్ స్కూల్లో చేర్పించవలసి ఉండటంతో తాను జూలై నుంచి పార్ట్ టైమ్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. యూనిసైకిల్పై కస్టమర్ల వద్దకు వెళ్లి, ఫుడ్‌ను అందిస్తానన్నారు. మోచేతికి కట్టుకున్న ఫోన్‌ను పెదవులతో ఆపరేట్ చేసి, కస్టమర్లకు కాల్ చేస్తానని తెలిపారు. రెస్టారెంట్ల సిబ్బంది, కస్టమర్లు తనకు సహకరిస్తున్నారన్నారు. కొందరు తనకు టిప్స్ కూడా ఇస్తూ ఉంటారని చెప్పారు. మొదటి నెలలో సుమారు రూ.15,840 సంపాదించినట్లు తెలిపారు. తొలి సంపాదనను ఓ చారిటీ సంస్థకు విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. తనకు తన భార్య సహకరిస్తున్నదని చెప్పారు.