- ఆ సంఘం రాష్ట్ర నాయకుడు కునుసోతు ధర్మ
బూర్గంపహాడ్, ఏప్రిల్ 06 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహా సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు కునుసోతు ధర్మ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని టేకులచెరువులో జరిగిన మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి వ్యవసాయాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో 13 నెలల పాటు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి పోరాటం చేసి విజయం సాధించామన్నారు.
దేశంలో రైతు సంఘం ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర, పంటలకు బీమా సౌకర్యం కల్పించేలా డిమాండ్ చేస్తుందన్నారు. త్వరలో జరగనున్న రైతు సంఘం మహా సభలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోరాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సర్పంచ్ బోళ్ల సైదమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, బోళ్ల శ్రీశైలం, కార్యదర్శి కందుకూరి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి పాండవుల రామనాధం, ఉపాధ్యక్షుడు కొమర్రాజు సత్యనారాయణ, సభ్యులు నిమ్మల అప్పారావు, దామోదర్‌రెడ్డి, పుల్లారెడ్డి, బిక్షమయ్య, రాఘవమ్మ పాల్గొన్నారు.