కొత్తగూడెం గణేష్ టెంపుల్, మే 20 : మొక్కజొన్న, వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతుందని మొక్కజొన్న, వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, మార్కెట్లో దళారీలను కట్టడి చేయాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని, రైతులకు పెండింగ్ లో ఉన్న డబ్బులను చెల్లించాలని కోరుతూ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం-ఇల్లెందు – పాల్వంచ క్రాస్ రోడ్లో సడక్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల మొక్కజొన్న, వడ్లు తడిసి తీవ్రంగా రైతులు నష్టపోయారని, అలాగే మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యం కూడా తడిసిపోతుందన్నారు.
ధాన్యం రవాణాకు సరిపడా లారీలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, జిల్లాలో సరిపడా గోడాన్స్ ను అందుబాటులో ఉంచకపోవడం వల్ల రైతులు పంటలను నిల్వ చేసుకోలేకపోయారన్నారు. అలాగే ప్రభుత్వం సకాలంలో వరి ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడం వల్ల వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని, 60 శాతంకు పైగా ధాన్యం తక్కువ రేటుకు వ్యాపారుల చేతుల్లోకి వెళ్తుందని దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ సొమ్ము వ్యాపారులు, మార్కెట్ చైర్మన్, సొసైటీ చైర్మన్లులు ప్రభుత్వ అధికారులు, దళారులు పంచుకు తింటున్నారని ఆయన అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 15, 20 రోజుల్లో డబ్బులను ఖాతాలో జమ చేయాలని, యాప్ నమోదుపై అవగాహన లేని రైతులకు అవగాహన కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బట్టు ప్రసాదు, గూగులోత్ రామచంద్రు, కొమరం సత్యనారాయణ, మెస్ గోపాల్ పెద్దగోని ఆదిలక్ష్మి, మల్లోజు సుగుణ, రమేష్, కల్తి వెంకటేశ్వర్లు, ఉప్పరబోయిన రామ్మూర్తి, వెంకట్రాం, లిక్కి నరేష్ పాల్గొన్నారు.