బూర్గంపహాడ్, జూన్ 08 : స్కూటీని లారీ ఢీకొనగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మర్రికుంట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం కొత్త సూరారం గ్రామానికి చెందిన శ్రీవల్లి, వైష్ణవి శని, ఆదివారాలు సెలవులు ఉండటంతో వేపలగడ్డలో తమ బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా వేపలగడ్డ నుండి మర్రికుంట వద్ద ఉన్న ప్రధాన రహదారిపైకి వస్తున్న క్రమంలో మోరంపల్లిబంజర్ వైపు నుండి లక్ష్మీపురం వైపు జామాయిల్ కర్రలోడుతో వస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టింది.
ఈ సంఘటనలో వాహనం నడుపుతున్న శ్రీవల్లి, వైష్ణవి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో శ్రీవల్లి తల, శరీర భాగాలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మోరంపల్లిబంజర్ ప్రాథమిక ఆరోగ్య ఆస్పత్రికి ప్రథమ చికిత్స కోసం తరలించి చికిత్స చేయించారు. అనంతరం 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీవల్లి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్కు తరలించారు.