భద్రాచలం, మార్చి 20 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో లిఫ్ట్ పనిచేయడం లేదు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం దర్శనానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో రామయ్యను దర్శించుకునేందుకు నానా అవస్థలు పడ్డారు.
లిఫ్ట్ గతంలో సైతం మరమ్మతులకు గురైంది. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. కాగా లిఫ్ట్ మరోసారి పనిచేయకుండా పోయింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయ నిర్వాహకులపై దివ్యాంగులు, వృద్ధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా లిఫ్ట్ మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.