కొత్తగూడెం అర్బన్, మే 14 : కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ పార్క్ లో దొంగలు పడ్డారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నపిల్లలు, యువతీ యువకులు, కుటుంబ సమేతంగా వచ్చి సేదతీరుతుంటారు. పార్క్ లోని ఓపెన్ జిమ్, ఫత్సాల్ కోర్టులో క్రీడాకారులు రాత్రి 9 గంటల వరకు ఆటలు ఆడుతూనే ఉంటారు. పార్క్ సుందరీకరణలో భాగంగా మూడు నెలల క్రితం డీఎంఎఫ్ నిధులతో అధునాతన ఎల్ఈడీ లైట్లను అమర్చారు. సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో 70 లైట్లను అమర్చారు. దీంతో పార్క్ వెలుగుజిలుగులతో నిండిపోయింది. పార్క్ సందర్శనకు వచ్చే వారికి ఇది సౌకర్యంగా ఉండటంతో పాటు, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
అయితే గత కొన్ని రోజులుగా పార్క్ లోని ఎల్ఈడీ లైట్లు వెలగడం లేదు. మరమ్మతులకు గురయ్యాయేమోనని సందర్శకులు పెద్దగా పట్టించుకోలేదు. కాగా అసలు విషయం వెలుగుచూడడంతో సందర్శకులు అవాక్కయ్యారు. లైట్లు మరమ్మతులకు కాకుండా చోరీకి గురైనట్లు తెలిసింది. ఖరీదైన ఎల్ఈడీ లైట్లు చోరీకి గురవుతున్నా ఇప్పటి వరకు సంబధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ఇది ముమ్మాటికీ ఇంటి దొంగల పనే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎల్ఈడీ లైట్లు చోరీ చేసిన దొంగలను పట్టుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ డీఈ రవికుమార్‌ను వివరణ కోరగా ఎల్ఈడీ లైట్ల చోరీపై విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.