కొత్తగూడెం అర్బన్, మే 28 : త్వరలో చేపట్టబోయే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు శ్రీనివాస్ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడా సామాజిక వర్గ ఓట్లు కారణమన్నారు. రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో లంబాడీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అలాంటి లంబాడ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. అగ్రకులాలకు మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ఇప్పటికైనా త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్నారు. లేకుంటే తీవ్ర వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లంబాడ సామాజిక వర్గం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ లంబాడీల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 30న గాంధీభవన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, రాష్ట్ర కోశాధికారి భుక్యా రవికుమార్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి బట్టు వీరన్న నాయక్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బోడ శ్రీనివాస్ నాయక్, జిల్లా కార్యదర్శి బోడ మంగ నాయక్, గౌరవ అధ్యక్షుడు రమేశ్ నాయక్, గుగులోతు బాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు హరీశ్ నాయక్, జిల్లా కార్యదర్శి ధారావత్ నాగరాజు నాయక్, జి.రమేశ్ నాయక్, బి అఖిల్ నాయక్, నాగేశ్, బి నాగేశ్ నాయక్, బి.చైతన్య నాయక్, బి.చరణ్ నాయక్, బి.మహేశ్ నాయక్, బి.అర్జున్ నాయక్, టి.లక్ష్మణ్ నాయక్, జానకిరామ్ నాయక్ పాల్గొన్నారు.