బూర్గంపహాడ్, జూలై 03 : బూర్గంపహాడ్ మండలం పారిశ్రామికవాడగా ఉన్న మేజర్ పంచాయతీ సారపాకలో ఎన్నో పోరాటాల ఫలితంగా ఐటీసీ సహకారంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌కు పర్యవేక్షణ కరవైంది. పబ్లిక్ టాయిలెట్‌ను అన్ని వసతులతో నిర్మించినప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుండి పనులపై వచ్చిన మహిళలు పబ్లిక్ టాయిలెట్‌ను వినియోగించుకోవాలంటే కనీసం నీటి వసతి కూడా లేకపోవడం శోచనీయం. ఈ పబ్లిక్ టాయిలెట్ కు ట్యాంక్, నీటి వసతి కోసం మోటారు ఏర్పాటు చేయడంతో పాటు పర్యవేక్షణ కోసం ఒకరిని నియమించారు. కొద్ది రోజులుగా అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో పబ్లిక్ టాయిలెట్ శుభ్రత చూసే వారు లేకుండా పోయారు. దీంతో పంచాయతీ అధికారుల పాలన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సర్పంచ్, కార్యదర్శి స్పందించి పబ్లిక్ టాయిలెట్లో నీటి వసతి కల్పించాలని, మూత్రశాలలు శుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.