రామవరం ఆగస్టు 13 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత ఏరియాగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. నిత్యం పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం అధికారులు ఉండే ఎన్ సి, ఏ టైపు, బీ టైపు క్వార్టర్స్ వరకే పనులు చేస్తున్నారని, కార్మిక ప్రాంతాల్లో పరిశుధ్యం పూర్తిగా లోపించింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్, రిక్షాలు ఉన్నప్పటికీ వాడక పోవడంపై కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అన్నీ ఉన్నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగించేలా చర్యలు తీసుకుపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలే వర్షాకాలం.. ఆపై డెంగీ, మలేరియా వ్యాధుల విజృంభణ. ఇప్పటికే చిన్న పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారు. చెత్త దుర్గంధంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల నివారణ కోసం ఏరియాలో కనీసం ఫాగింగ్ కూడా నిర్వహించడం లేదు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వర్షాకాలంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఎప్పటి చెత్త అప్పుడే తొలగించే విధంగా కార్యాచరణ చేపడితే బాగుంటుందని కార్మికులు కోరుతున్నారు.