కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 17 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు ఉరితాళ్లు వంటివని, వాటి అమలును అడ్డుకునేందుకే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వివిధ జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని సీఐటీయూ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్,ఎ, జలీల్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ, హెచ్ఎంఎస్ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్. శంకర్రెడ్డి మాట్లాడారు.
పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను లేబర్ కోడ్ల అమలు ద్వారా కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తుందని వారు విమర్శించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలలో కార్మికులకు అనుకూలంగా ఉన్న అనేక అంశాలను నూతనంగా తెచ్చిన లేబర్ కోడుల్లో కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. శ్రమ దోపిడీని తీవ్రతరం చేయడం, యాజమాన్యాలకు లాభాలు సమకూర్చి పెట్టడం, కార్మిక హక్కులను బలహీనపరచటమే లేబర్ కోడ్ల సారాంశంగా ఉందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. లేబర్ కోడులు అమల్లోకి రాకముందే దేశంలోని బడా కార్పొరేట్ కంపెనీల అధినేతలు వారానికి 90 గంటలు పని ఉండాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారని, పని గంటల పెంపు కార్మికులను మరింత దోపిడీకి, అణిచివేతకు గురి చేస్తుందని, మనిషి జీవన విధానాన్నిదెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రగతికి తీవ్ర ఆటంకంగానూ మారుతుందన్నారు.
వేతన భద్రత, ఉద్యోగ భద్రత ,సామాజిక భద్రత కోసం సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులు, ప్రభుత్వ రంగం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని దీన్ని ప్రతిఘటించేందుకే సార్వత్రిక సమ్మె చేస్తున్నామని నాయకులు ప్రకటించారు. ఈ సదస్సుకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె. బ్రహ్మచారి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జమలయ్య, ఐఎన్టీయూసీ జిల్లా నాయకుడు నాగభూషణం, టియుసిఐ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు సారంగపాణి, హెచ్ఎంఎస్ నాయకుశ్ జి.రమేశ్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సదస్సులో ఆయా సంఘాల నాయకులు బి మధు, మందా నరసింహారావు, వీరాస్వామి, త్యాగరాజు, యాకూబ్ షావలి, ఎండి రాసుద్దీన్, శ్రీనివాస్, మల్లికార్జున్, జి పద్మ, డి వీరన్న, నబి, విజయగిరి శ్రీనివాస్, కె.సత్య, దొడ్డ రవి, భూక్య రమేశ్ పాల్గొన్నారు.
Kothagudem : లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు ఉరితాళ్లు : కార్మిక సంఘాల నేతలు