రుద్రంపూర్, జూలై 01 : కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో బుధవారం కేవీకే ప్రాంగణంలో “మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (MANP) 2026–27” కార్యక్రమంలో భాగంగా కంది పంటపై క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్స్ (CFLDs) అమలుకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపిక చేసిన రైతులకు TDRG-59 రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు. జిల్లాలోని ఆరు మండలాలకు చెందిన 130 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) కొత్తగూడెం చైర్మన్ లాల్సింగ్ నాయక్ మాట్లాడుతూ.. రైతులు కేవీకే అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు, శాస్త్రీయ సాంకేతిక సలహాలు, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా జిల్లాలో కంది సాగు విస్తీర్ణం, దిగుబడులు పెంచుకోవచ్చని అన్నారు.
కేవీకే సీనియర్ శాస్త్రవేత్త & హెడ్ డా.టి.భరత్ మాట్లాడుతూ పంట వైవిధ్యీకరణ, కంది సాగులో సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా పంటలపై పడే ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు అమ్రు, అశోక్ బాబు, సర్పంచ్ వెంకన్నతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో గిరిజన ఉప ప్రణాళిక (TSP) కింద అర్హులైన లబ్ధిదారులకు కోళ్ల పిల్లలను పంపిణీ చేశారు.

కంది సాగు అభివృద్ధికి కేవీకే శిక్షణ – రైతులకు విత్తనాల పంపిణీ