– “సండే బ్రిక్స్ ఛాలెంజ్” తర్వాత శుభ్రం చేయడం మరిచిన మున్సిపల్ అధికారులు
– ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులు
కొత్తగూడెం అర్బన్, జూన్ 24 : నిర్వహణ లేమితో కొత్తగూడెం ప్రగతి మైదానం అస్తవ్యస్థంగా తయారైంది. ప్రగతి మైదానంలో గత ఆదివారం ఎంతో ఉత్సాహంగా “సండే బ్రిక్స్ ఛాలెంజ్” లో భాగంగా బ్రిక్స్ తయారు చేసే కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ, డీఆర్డీఏ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభ చాటారు. విజేతలకు కలెక్టర్ టీ షర్ట్ అందజేశారు. కార్యక్రమం విజయవంతం అయింది. సంబురాలు ముగిశాయి. కాగా మైదానం నిర్వహణను మాత్రం గాలికొదిలేశారు మున్సిపల్ అధికారులు.
బ్రిక్స్ ఛాలెంజ్ పోటీకి అవసరమైన మట్టి, ఇసుక, సిమెంట్ తదితర సామగ్రి తీసుకువచ్చారు. పోటీ అనంతరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వెళ్లిపోయారు. దీంతో ప్రగతి మైదాన్‌లో మట్టి, ఇసుకతో నింపిన బస్తాలు, ఖాళీ బస్తాలు ఎక్కడివక్కడే ఉన్నాయి. మైదానంలో ఎటు చూసినా ఇసుక, మట్టి, ఖాళీ బస్తాలే దర్శనమిస్తున్నాయి. దీంతో వివిధ క్రీడలు ఆడేందుకు, ప్రాక్టీస్ చేసుకునేందుకు మైదానానికి వచ్చే క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. సమన్వయంతో పనిచేసిన మున్సిపల్, పట్టణ పేదరిక నిర్మూలన, సెర్ప్, డీఆర్డీఏ విభాగాలు కార్యక్రమం తర్వాత మైదానంను శుభ్రం చేయాలనే ఆలోచన చేయకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు ఇసుక, మట్టి, ప్లాస్టిక్ సంచులు తొలగించి క్రీడాకారుల ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు.
Kothagudem Urban : అస్తవ్యస్థం.. కొత్తగూడెం ప్రగతి మైదాన్