కొత్తగూడెం ఆర్బన్, మే 15 : కొత్తగూడెం పట్టణంలో క్రీడలు నిర్వహించేందుకు ఒకప్పుడు ప్రకాశం స్టేడియం మాత్రమే ఉండేది. ఆ స్టేడియం సింగరేణి సంస్థ అధీనంలో ఉండేది. విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా కారణంగా స్టేడియం సరిపోయేది కాదు. ఇక పట్టణలోని రామవరంలో ఉన్న సాధన స్టేడియం ఆ ప్రాంతానికే పరిమితమైంది. దీంతో ఈ విషయాన్ని గమనించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులకు మరొక స్టేడియం అవసరమని భావించి రాజీవ్ పార్క్ సమీపాన ఉన్న సుమారు ఏడు ఎకరాల స్థలాన్ని చదును చేసి ‘ప్రగతి మైదాన్’ గా నామకరణం చేసి ఒక స్టేడియంగా తయారు చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది రూపాయల నిధులను విడుదల చేసింది. కానీ వాటిని సక్రమంగా వినియోగించకుండా, అడ్డగోడులుగా ఖర్చు చేసి, జేబులు నింపుకుని పాడి ఆవుగా మారుస్తున్నారు కాంట్రాక్టర్లు, అధికారులు. నిర్వహణ లేమితో కొత్తగూడెం ప్రగతి మైదాన్ అస్తవ్యస్థంగా తయారైంది.
పట్టణ ప్రగతి నిధుల ద్వారా ప్రగతి మైదాన్‌కు నిధులను కేటాయించారు. ప్రగతి మైదాన్‌లో టెన్నిస్ కోర్టు నిర్మాణానికి రూ.50 లక్షలు, బాస్కెట్ బాల్ కోర్టుకు రూ.15 లక్షలు, వాకింగ్ ట్రాక్‌కు రూ.20 లక్షలు, బెంచీలు, మొక్కలకు రూ.5 లక్షలు, ప్రహరీకి రూ.50 లక్షలు, రాజీవ్ పార్కులో ఫట్సాల్ కోర్టుకు రూ.50 లక్షలు ఇలా సుమారు రూ.1.70 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. మైదానం మధ్యలో సింథటిక్ వాకింగ్ ట్రాక్ అంటూ రూ.20లక్షలు కేటాయించారు. ఏమైందో ఏమో కానీ సగం పనులు చేపట్టాక మధ్యలోనే నిలిపేశారు. దీంతో మైదానం అస్తవ్యస్థంగా తయారైంది. మధ్యలోనే పనులు నిలిపివేయడంతో వాకింగ్, రన్నింగ్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. పనులు మధ్యలో ఆపడం వల్ల కంకర తేలి వాకర్స్ కు, రన్నర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మధ్యలో నిలిపివేసిన వాకింగ్ ట్రాక్ లెవెల్ చేసేందుకు సింగరేణి అధికారులతో మాట్లాడి చుట్టూ లెవెల్ చేసేందుకు ఎర్రమట్టితో నింపాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో మున్సిపల్ అధికారులు ఎర్రమట్టిని వేసి లెవెల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ పనిని సగంలోనే నిలిపివేశారు. సుమారు 150 లారీల ఎర్రమట్టిని నింపాల్సి ఉండగా 70 లారీల మట్టినే తీసుకువచ్చి పోసి మ..మ.. అనిపించారు. దీంతో మైదానం అంతా ఎగుడుదిగుడుగా మట్టిదిబ్బలుగా మారిపోయింది. క్రీడాకారులు మరింత ఇబ్బందులుపడుతున్నారు.
Kothagudem Urban : నిర్వహణలేమితో అధ్వాన్నంగా కొత్తగూడెం ప్రగతి మైదాన్
తొలుత రూ.20 లక్షల నిధులతో స్టేడియం మధ్యలో సింథటిక్ వాకింగ్ ట్రాక్ మొదలుపెట్టి మధ్యలోనే వదిలివేసి చిత్తడిచిత్తడిగా చేశారు. మళ్లీ ఇప్పుడు మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకునేందుకా అన్నట్లు మరో ప్లాన్ వేశారు. తాజాగా మరో రూ.20 లక్షల నిధులతో పనులు చేపట్టారు. మైదానం చుట్టు సింథటిక్ ట్రాక్ స్థానంలో మాములు వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మధ్యలో నిలిపివేసిన సింథటిక్ వాకింగ్ ట్రాక్ పనుల సంగతి ఏంటని, మళ్లి వాకింగ్ ట్రాక్ అంటూ పనులు చేపట్టి ప్రజాధనం వృధా చేస్తున్నారని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులను ఎప్పటికీ పూర్తి చేయకుండా చేసిన పనులనే చేస్తూ ప్రగతి మైదానాన్ని జేబులు నింపే పాడి ఆవుగా మార్చుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి మైదాన్‌లో పట్టణ ప్రగతి నిధులతో సుమారు రూ.5 లక్షలతో నిర్మించిన టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రాక్టీస్ చేసేందుకు వచ్చేవారు మూత్ర విసర్జన చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్ల తలుపులు విరిగిపోగా, నీటి కనెక్షన్ పైపులు పగిలిపోయాయి. ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరం సైతం ఈ మైదానంలో నిర్వహించడంతో చిన్నారులు, విద్యార్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రగతి మైదాన్ పనులు, పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని క్రీడాకారులు కోరుతున్నారు. ప్రగతిమైదాన్‌లో జరుగుతున్న వాకింగ్ ట్రాక్ పనుల గురించి మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాతను వివరణ కోరగా మైదానంలో జరుగుతున్న పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తానని, టాయిలెట్ల సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
Kothagudem Urban : నిర్వహణలేమితో అధ్వాన్నంగా కొత్తగూడెం ప్రగతి మైదాన్