ఇల్లెందు, అక్టోబర్ 22 : ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ జయంతిని ఇల్లెందులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇన్చార్జి హరిప్రియ నాయక్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇల్లెందు పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి కొమురం భీమ్ అన్నారు. ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిన యోధుడు కొమురం భీమ్ అని కొనియాడారు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు అని గుర్తు చేసుకున్నారు.
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక, స్వయం పాలన, అస్తిత్వ ఉద్యమాలకు వేగు చుక్క కొమురం భీమ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సిలివేరి సత్యనారాయణ, జీకే శీను, పరుచూరి వెంకటేశ్వర్లు, నెమలి ధనలక్ష్మి, కటకం పద్మావతి, కొక్కు సరిత, కడకంచి పద్మావతి, చీమల సుజాత, రాజేశ్, హరిప్రసాద్, హరికృష్ణ, చాంద్ పాషా, మండల నాయకులు రేణుక, లకావత్ దేవిలాల్, దాస్యం ప్రమోద్, ఘాజి, మోహన్ రావు, లాల్ సింగ్, మౌనిక, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Yellandu : ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్ : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్