భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ) జూలై 27/ ఖమ్మం వ్యవసాయం: పదేళ్లుగా కొనసాగుతున్న మినీ అంగన్వాడీ కేంద్రాలు జనాభా ప్రాతిపదికన ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వే ఆధారంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా మార్చనున్నది. దీంతో భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టుల పరిధిలోని 626 మినీ కేంద్రాల్లో 320 పైగా ప్రధాన కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలోని ఏడు ప్రాజెక్టుల పరిధిలోని 235 మినీ కేంద్రాల్లో 105 కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారే అర్హతలు ఉన్నాయి. కల్లూరు ప్రాజెక్టు పరిధిలో 15 కేంద్రాలు, కామేపల్లి పరిధిలో 20 కేంద్రాలు, ఖమ్మం అర్బన్‌లో 13, ఖమ్మం రూరల్‌లో 29 కేంద్రాలు, మధిరలో 13, సత్తుపల్లిలో ఆరు, తిరుమలయపాలెం తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. ఇప్పటికే కుటుంబ సర్వే నివేదికలు ఉన్నతాధికారుల టేబుల్‌పైకి వెళ్లాయి. మరో నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయి.
కుటుంబ సర్వే ఆధారంగా మార్పు..
పదేళ్ల క్రితం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ కుటుంబాలు ఉండడం, రెవెన్యూగ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడంతో నాటి ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మినీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో జనాభా పెరగడంతో మిని కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలు అందించడం కష్టతరంగా మారింది. వాటిని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని వినతులు వెల్లువెతత్తడంతో ప్రభుత్వం స్పందించింది. సమస్యల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మినీ అంగన్వాడీ కేంద్రాలను ‘మెయిన్’ కేంద్రాలుగా మార్చనున్నది.
సెంటర్ల అప్‌గ్రేడ్‌తో పెరగనున్నహెల్పర్ల పోస్టులు..
మినీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచరే అన్ని పనులు చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అయితే ప్రభుత్వం ప్రతి కేంద్రానికి హెల్పర్‌ను ఇస్తుంది. దీంతో హెల్పర్ పోస్టులు భర్తీ అవు తాయి. వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది. మినీ అంగన్వాడీ టీచర్ల జీతం 7,800 నుంచి ఏకంగా 13,650కు పెరుగుతుంది.
అప్‌గ్రేడ్‌కు మార్గదర్శకాలు ఇవీ..
మినీ అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్‌కు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో 300 కుటుంబాలకు పైగా ఉన్న ఆవాసాలు, అర్బన్ ఏరియాల్లో 400 కుటుంబాలు ఉన్న ఆవాసాలు ఉన్న మినీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అవుతాయి. ఇప్పటికే సర్వే చేసిన సీడీపీవోలు మినీ కేంద్రాల సర్వే రిపోర్ట్‌ను జిల్లా కార్యాలయానికి చేరాయి.
జనాభా ఆధారంగా సెంటర్ల మార్పు..
గతంలో చిన్న గ్రామాల్లో మినీ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు అక్కడ కుటుంబాలు పెరిగాయి. జనాభా పెరిగింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందాలంటే ఆయా కేంద్రాల అప్‌గ్రేడ్ తప్పనిసరి. అప్‌గ్రేడ్ అయిన కేంద్రాల్లో హెల్పర్లను నియమిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ప్రక్రియ మొదలుకానున్నది.
– ఆర్.వరలక్ష్మి,డీడబ్ల్యూవో, కొత్తగూడెం