
భద్రాచలం, సెప్టెంబర్ 4: భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని త్రిదండి చిన జీయర్ స్వామి, అహోబిల రామానుజ స్వామి, దేవనాథ రామానుజ స్వామి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అథికారులు చిన జీయర్‌స్వామికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా చిన జీయర్‌స్వామి.. లక్ష్మీతాయారమ్మ వారిని సందర్శించారు. అనంతరం అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రామయ్యకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద దేవస్థానం వేద పండితులు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు విరచితమైన భాగవతంలో గీతలు, శ్రీ భాగవత నామ కోశం అనే రెండు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి వికాస తరంగిణి, జీయర్ మఠం సభ్యుల కోలాటాలతో ‘జైశ్రీరామ్, జై శ్రీమన్నారాయణ’ అనే జయజయధ్వానాలతో మాతృశ్రీ అలివేలు మంగ చిత్రపటంతో చిన జీయర్ స్వామి, అహోబిల రామానుజ స్వామి, దేవనాథ రామానుజ స్వామి భద్రగిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం నాలుగు దిక్కులా భద్రాద్రి రామయ్యకు వైభవం పెరగాలనే సత్సంకల్పంతో హారతి ఇచ్చి కొబ్బరి కాయ కొట్టారు.
తదుపరి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, జీయర్మఠం, వికాస తరంగిణి సభ్యులకు మాతృశ్రీ తదియారాధన నిర్వహించారు. అనంతరం వికాస తరంగిణిలో ఏడాది పొడుగునా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే సభ్యులతో, జీయర్ మఠం సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి వారికి వస్త్ర సమర్పణ చేశారు. అహోబిల రామానుజ స్వామి, దేవనాథ రామానుజ స్వామి, వికాస తరంగిణి, సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా రామయ్యకు పట్టాభిషేకం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని రాములోరికి వైభవంగా పట్టాభిషేకం జరిపించారు. నిత్యకల్యాణం పూర్తయిన అనంతరం అదే వేదికపై స్వామివారికి పట్టాభిషేకం చేశారు. ముందుగా పట్టాభిషేకం విశిష్టతను ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. మధ్య కలశంలో 500 నదులను ఆవాహన, నాలుగుదిక్కులా నాలుగు సముద్రాలను ఆవాహన చేశారు. నాలుగు కలశాలలో వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్నలను ఆవాహన చేశారు. మిగిలిన నాలుగు కలశాలలో పురుష, సత్య, అచ్యుత, అనంతలను ఆవాహన చేశారు. మధ్య కలశంలో రామయ్యను ఆవాహన చేశారు. బంగారు ఛత్ర, చామరాలను, కత్తి, డాలు, బరిసె, ధనుర్భాణాలు, శంఖు చక్రాలు, స్వర్ణాభరణాలు, రాజదండం, రాజముద్రిక, బంగారు పాదుకలు ధరింపజేశారు. మధ్యలో రత్న కిరీటాన్ని స్వామివారికి అలంకరించారు. మహా కుంభప్రోక్షణ అనంతరం రత్న కిరీటాన్ని స్వామివారికి ధరింపజేశారు.