రుద్రంపూర్, మే 21 : ఒడిశా రాష్ట్రంలోని పూరీలో ఘనంగా జరుగుతున్న 14వ ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (IMWF) మహాసభల్లో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కార్మిక నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు జాతీయ స్థాయి పదవులకు ఎన్నిక కావడంతో కార్మిక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మహాసభ రెండో రోజు గురువారం నిర్వహించిన సమావేశాల్లో ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (IMWF) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వాసిరెడ్డి సీతారామయ్య, జాయింట్ సెక్రటరీగా కొరిమి రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. అలాగే జాతీయ కౌన్సిల్ సభ్యులుగా వంగ వెంకట్, జి. వీరస్వామి ఎన్నికయ్యారు. కొత్త బాధ్యతలు దక్కిన నాయకులకు మహాసభలో పాల్గొన్న ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ మహాసభ దేశవ్యాప్తంగా గనుల కార్మిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని, కార్మికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.