– పారిశ్రామికవాడలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలి
బూర్గంపహాడ్, జూన్ 19 : పర్యావరణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే మానవాళికి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండలంలోని మండల పరిషత్, ఫారెస్ట్, ఐటీసీ, ఈజీఎస్ అధికారులు, సర్పంచ్ తో తన ఛాంబర్లో వన మహోత్సవంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పారిశ్రామిక వాడగా పిలుస్తున్న సారపాక పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో వనమహోత్సవంలో భాగంగా ఏడాదికి 25 వేల మొక్కల చొప్పున నాలుగేళ్లకు లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, ఇందుకు అన్నిశాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సారపాకలో ఖాళీ ప్రదేశాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత తీసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అటవీ శాఖతో పాటు ఐటీసీ పీఎస్పీడీ, ఈజీఎస్ శాఖల అధికారులు పంచాయతీకి మొక్కలను అందించి ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సారపాక పంచాయితీయే కాకుండా గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో ప్రాణ వాయువును ప్రసాదించే మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. మొక్కలు విరివిగా నాటి వాటిని సంరక్షించినప్పుడే మానవాళికి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, దీంతో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవన్నారు. పారిశ్రామిక ప్రాంతాలతో పాటు గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని దీనికి ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఫారెస్ట్ డీఆర్ఓ దారావత్ కృష్ణ, ఐటీడీఏ పరిపాలనాధికారి సున్నం రాంబాబు, ఐటీసీ డిప్యూటీ జీఎం విశ్వనాథం, ఈజీఎస్ ఏపీఓ విజయలక్ష్మి, సర్పంచ్ గుగులోత్ కిషోర్‌నాయక్, బీట్ ఆఫీసర్ భీమ్‌చంద్ పాల్గొన్నారు.