రామవరం, జూన్ 03 : ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎత్తుగడలు, ఆయనకున్న వాక్ చాతుర్యంతో హింసాయుత సంఘటనలకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ప్రగతి మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ కు వెన్నుండి నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసాగర్, మేధావులు, కవులు, కళాకారులు, కార్మిక లోకం, కర్షక లోకం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వయోభేదం, లింగ బేధం లేకుండా కలిసి కొట్లాడం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. నాడు సకల జనుల సమ్మెలో 42 రోజుల పాటు పాల్గొని తెలంగాణపై వారికున్న మక్కువను చూపెట్టుకున్నట్లు తెలిపారు. తాను శాసనసభ్యుడిగా గెలిచానంటే అంటే అది సింగరేణి కార్మికుల దయే అన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం కామ్రేడ్ శేషగిరిరావు, కొమురయ్య, విఠల్ రావు చూపెట్టిన మార్గంలోనే తాను పోరాడుతానని తెలిపారు.
తెలంగాణకు ఆర్థికపరమైన సంక్షోభం ఎప్పుడూ కూడా లేదన్నారు. మనది ధనిక రాష్ట్రం, కానీ డబ్బులు చేతుల్లో లేవు, ఆస్తులు రూపంలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేకపోతుంది. వారి సహాయంతో తాము గెలిచాం, మా సహాయంతో వారు గెలిచారు. స్నేహం స్నేహమే. స్నేహంగా ఉన్నామని నోరు మూసుకుని ఉండం. ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అనంతరం ఉత్తమ కార్మికుడిగా ఎన్నికైన ఆర్ సి హెచ్ పి కి చెందిన జక్కుల గట్టయ్యను సింగరేణి యాజమాన్యంతో కలిసి ఎమ్మెల్యే సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు, ఎస్ ఓ టు జి ఎం జీ. వి కోటిరెడ్డి, ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజీఎం సివిల్ సిహెచ్ రామకృష్ణ, ఆర్ సి హెచ్ పి ఎస్ ఈ.కరిముల్లా, క్వాలిటీ మేనేజర్ మదన్మోహన్, ఐ ఈ డి డి వై జీఎం యోహాన్, డివైపిఎం శివకేశవరావు, మురళి, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వట్టికొండ మల్లికార్జున్ రావు, ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, సిపిఐ సాబీర్ పాషా, మాజీ ఎంపీపీ సలిగంటి శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు జక్కుల గట్టయ్య, సముద్రాల సుధాకర్, హుమాయిన్, కత్తెర్ల రాములు, మధు కృష్ణ, ఐఎన్టీయూసీ నాయకులు చావసాగర్, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, సింగరేణి అధికారులు, కార్మికులు, డీఎల్ఆర్ కార్మికులు, ప్రభావిత ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.