కొత్తగూడెం, మార్చి 9 : పోరాట ధీరుడు కాసాని ఐలయ్య అని సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీలు అన్నారు. ఆదివారం సుజాతనగర్లో కాసాని ఐలయ్య, ఆయన సతీమణి లక్ష్మీల విగ్రహాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఐలయ్య సంస్మరణలో వారు మాట్లాడారు. తాను చనిపోవడానికి వారం రోజుల ముందు సుజాతనగర్లోని ఏడు గ్రామ పంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్లో కలపవద్దని పెద్ద ఉద్యమానికి ఐలయ్య శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
కలెక్టరేట్ ధర్నాకి ప్రజల్ని కదిలించడానికి తానే స్వయంగా ఇరవై గ్రామాలు తిరిగి అర్బన్ స్వభావం రాని పల్లె ప్రాంతాలను కార్పొరేషన్లో కలుపడం వల్ల జరిగే నష్టమేమిటో వివరించి, ప్రజల్ని చైతన్యం చేసిన ధీరుడు ఐలయ్య అని కొనియాడారు. తనను క్యాన్సర్ తో పాటు ఎన్నో జబ్బులు చుట్టుముట్టినప్పటికీ వెరువక ఈ పోరాటంలో కీలక పాత్ర వహించి ప్రజల్ని కదిలించాడన్నారు. అందుకే ఆయన ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటాడన్నారు. అనేక పోరాటాలు చేసి వందలాది మందికి ఇంటి జాగా అందించిన వ్యక్తి ఐలయ్య అని కొనియాడారు.
సుజాతనగర్ మండల కార్యదర్శి రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సుదర్శన్, అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు జల్లారపు రమేశ్, న్యూ డెమోక్రసీ నాయకుడు మధు, బీఆర్ఎస్ నాయకులు తులసి రెడ్డి, సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, కోనేరు చిన్ని, సీపీఐ మండల కార్యదర్శి దసృ, ఐలయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.