రామవరం, మార్చి 27 : 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కొత్తగూడెం ఏరియాలోని జే.వి.ఆర్. ఓసి -2 ప్రాజెక్ట్ అధిగమించింది. సంవత్సరానికి నిర్దేశించిన 112 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఇంకా 05 రోజులు మిగిలి ఉండగానే బుధవారం నాటికి సాధించడం జరిగిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది సింగరేణి చరిత్రలోనే 112 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఏకైక ఉపరితల ప్రాజెక్టుగా సరికొత్త రికార్డును నెలకొల్పిందన్నారు.
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా జే.వి.ఆర్. ఓసి -2 ప్రాజెక్ట్ కు నిర్దేశిస్తున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అనగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 100 లక్షల టన్నులు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 110.68 లక్షల టన్నులు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 112 లక్షల టన్నులను సాధించి తనకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను తానే అధిగమిస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ రికార్డ్ స్థాయిలో రక్షణతో ఉత్పత్తి లక్ష్యాలను పూర్తి చేస్తుందన్నారు. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఐఆర్ఎస్ దిశ నిర్దేశాలతో, డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు గారి సలహా, సూచనలతో లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు.
ఈ లక్ష్యసాధనలో భాగస్తులు అయినటువంటి జే.వి.ఆర్. ఓసి -2 ప్రాజెక్ట్ ఉద్యోగులకు, అధికారులకు అలాగే యూనియన్ ప్రతినిధులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఆర్థిక సంవత్సరాల్లో కూడా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో సాదించి కంపెనీ పురోగాభివృదికి కృషిచేయాలని ఆయన కోరారు.