చండ్రుగొండ, మార్చి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జూలూరుపాడు రోడ్డుకు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు, డ్రైనేజీని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. రహదారి వెడల్పులో భాగంగా చండ్రుగొండ నుండి జూలూరుపాడు వెళ్లే రహదారికి ఇరువైపులా డ్రైనేజీని నిర్మించారు. నిర్మాణం ఇంకా పూర్తిస్థాయిలో కాకముందే డ్రైనేజీపై బడ్డీ కొట్టులు, తాత్కాలిక షాపులను కొందరు వ్యాపారులు అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించారు.
ఆర్ అండ్ బి శాఖ లోని ఓ అధికారి, అధికార పార్టీ నేత అండదండలతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమించుకున్న తాత్కాలిక షాపులను అద్దెకు సైతం ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రహదారిని, డ్రైనేజీని ఆక్రమించుకుని అద్దెకి ఇవ్వడం పట్ల గ్రామస్తులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.