జూలూరుపాడు, ఏప్రిల్ 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కీలకమైన ప్రధాన రహదారి.. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగే మార్గం. కానీ నేడు ఆ రోడ్డు జూలూరుపాడు వాసులకు ఒక నరకప్రాయమైన అడ్డంకిగా మారింది. రోడ్డుపై అడుగు పొరలా పేరుకుపోయిన మట్టి వాహనాలు వెళ్తుంటే లేస్తున్న ధూళి మేఘాలు వెరసి జూలూరుపాడును ఒక ‘డస్ట్ జోన్’గా మార్చేశాయి. అధికారుల ఉదాసీనత కేవలం ప్రయాణికుల ప్రాణాలకే కాదు, స్థానిక వ్యాపారుల జీవనోపాధికి కూడా గొడ్డలి పెట్టులా మారింది.
రోడ్డు పక్కన ఉన్న కంప్యూటర్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, ఫొటో స్టూడియోల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. నిరంతరం లేస్తున్న సూక్ష్మ ధూళి కణాలు అత్యాధునిక యంత్రాల్లోకి చేరి వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఫొటో ప్రింటర్లు, హై-ఎండ్ డిజిటల్ కెమెరాలు, జిరాక్స్ మిషన్లలోని సెన్సార్లు ధూళి కారణంగామొరాయిస్తున్నాయి. ఒక్కో సెన్సార్ లేదా మదర్ బోర్డ్ పాడైతే వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. డస్ట్ వల్ల యంత్రాలు తరచూ రిపేరుకు వస్తుండటంతో, కస్టమర్లకు సేవలు అందించలేక వ్యాపారాలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. రోజుకు పది సార్లు తుడుచుకున్నా ఫలితం లేదని, మిషన్ల సర్వీసింగ్ కోసమే సంపాదనంతా ఖర్చవుతోందని వ్యాపారులు వాపోతున్నారు.
రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, కంకర రాళ్ల వల్ల ఈ ప్రాంతం ఒక ‘డెత్ ట్రాప్’లా మారింది. ద్విచక్ర వాహనదారులు కొంచెం వేగంగా వచ్చి బ్రేక్ వేసినా, మట్టిపై టైర్లు పట్టు కోల్పోయి వాహనం స్కిడ్ అవుతోంది. రాత్రి వేళల్లో రోడ్డు మార్జిన్లు కనిపించక, మట్టి మేటలను గమనించక వాహనదారులు కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నారు. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు లేచే దుమ్ము వల్ల ఎదురుగా వచ్చే వాహనం కూడా కనిపించని పరిస్థితి.
పంచాయతీ అధికారులు పన్నుల వసూలుపై చూపే శ్రద్ధలో కనీసం వంతైనా ఈ రోడ్డు శుభ్రతపై చూపకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. రోజూ ఇదే మార్గంలో ఏసీ కార్లలో తిరిగే ప్రజా ప్రతినిధులకు సామాన్యుడి కళ్లు కుడుతున్న దుమ్ము, వ్యాపారుల యంత్రాలు పాడవుతున్న వైనం కనిపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. అభివృద్ధి అంటే కేవలం గ్రాఫిక్స్‌లో చూపించడం కాదు.. ప్రజలు నడిచే దారి భద్రంగా ఉండటం. ఒక పక్క డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతుంటే, మరోపక్క రోడ్డుపై దుమ్ము వల్ల డిజిటల్ యంత్రాలు పాడై వ్యాపారులు రోడ్డున పడుతున్నారు. ఇది కేవలం మట్టి సమస్య కాదు, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల తలెత్తిన మానవ నిర్మిత విపత్తు. తక్షణమే రోడ్డును వాక్యూమ్ క్లీనర్లతో లేదా వాటర్ ట్యాంకులతో శుభ్రం చేయించి, శాశ్వత బిటి ప్యాచ్ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

బీటీ రోడ్డుపై మట్టి మేటలు.. సామాన్యుడి ప్రాణాలు గాల్లో దీపాలు