జూలూరుపాడు, మార్చి 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామానికి చెందిన దామెర్ల శివ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన శివ ఉన్న కొద్దిపాటి ఆస్తులను వైద్యం కోసం ఖర్చు చేశాడు. ప్రస్తుతం అతనికి ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో విషయం తెలుసుకున్న జేపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఇడుపుల రాజు మంగళవారం దామెర్ల శివ ఇంటికి వెళ్లి పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న శివకు దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరారు. ఫౌండేషన్ నుండి కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ధైర్యాన్ని ఉండాలన్నారు. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సహృదయంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దామెర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.