Attack on CJI | కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 6 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడిని జైభీమ్రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది యెర్రా కామేశ్ తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ గౌరవం కోసం ప్రజలు, సామాజిక ఉద్యమకారులు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
ఇది వ్యక్తి మీద జరిగిన దాడి మాత్రమే కాదని.. మొత్తం న్యాయవ్యవస్థపై, రాజ్యాంగ విలువలపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని యెర్రా కామేశ్ తెలిపారు. ఈ దుశ్చర్య న్యాయవృత్తి గౌరవాన్ని దెబ్బతీయడానికి, న్యాయ స్వాతంత్య్రాన్ని క్షీణింపజేయడానికి చేసిన కుట్రగా అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటం మనందరి కర్తవ్యమని అన్నారు. ప్రజలందరూ న్యాయవ్యవస్థను విశ్వసిస్తూ ప్రజలందరూ నిరసన తెలపాలని కోరారు.
న్యాయమూర్తులపై దాడి అంటే న్యాయం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని యెర్రా కామేశ్ అన్నారు. అందువల్ల న్యాయవృత్తి గౌరవం రక్షణలో మనందరం ఏకమై నిలుద్దామని అన్నారు. మతోన్మాదుల దుశ్చర్యలు నశించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా న్యాయమూర్తిపై దాడి చేసిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.