– ఐటీసీ తీరుపై కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ మండిపాటు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 15 : మండుటెండను సైతం తట్టుకుని కార్మికులు దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కనికరం చూపడం లేదని, కార్మిక సమస్యలకు న్యాయం జరగాలని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ రిలే దీక్షలతో పోరాటం చేస్తుంటే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎస్కే యాకూబ్‌పాషా, బల్లెం నాగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం 21వ రోజుకు దీక్షలు చేరుకోవడంతో దీక్షల్లో కడారి జయరాం, పుట్టి విజయరాజు, ముమ్మడి శ్రీనివాసరావు, జంపన హరిబాబు పాల్గొన్నారు. దీక్షల్లో కార్మికులకు ఉపాధ్యక్షులు చట్టు ఆంజనేయులు, ఆకిని సర్వేశ్వరరావు పూలమాల వేసి పోరాటానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల 14వ వేతన ఒప్పందంలో కార్మికులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నామని, ఈ పోరాటానికి ప్రతి కాంట్రాక్టు కార్మికుడు కలిసి రావాలన్నారు.
21 రోజులుగా దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తుందని, మొద్దునిద్ర పోతుందని, జేఏసీ నాయకులను చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తుందని, యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని రానున్న రోజుల్లో పోరాటం తీవ్రతరం చేయడంతో పాటు సమ్మె చేపట్టి యాజమాన్యం దిగొచ్చేలా చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు మర్రి వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, సూరిశెట్టి జగదీష్, అకిని చందర్రావు, మేకల శేషమ్మ, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కోడూరు శ్రీనివాసరావు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.