– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
బూర్గంపహాడ్, మార్చి 23 : సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ అంశాలు పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పంద ప్రక్రియను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతోనే జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఐటీసీ గేటు వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ తదితర ట్రేడ్ యూనియన్ల నాయకులు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్లు పాటి సోమిరెడ్డి, సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. న్యాయమైన కోర్కెలను యాజమాన్యం తీర్చేంత వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఐటీసీ పీఎస్పీడీ పేరుతో పంచ్‌కార్డు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు, ప్లాంటేషన్ కార్మికులకు ఇస్తున్న వేతనాలకు అదనంగా రోజుకు రూ.500 ఇస్తూ వేతన ఒప్పందంలో పెంచిన మొత్తం బేసిక్ లో కలపాలన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు మొత్తం వేతనంపై ఎలాంటి సీలింగ్ లేకుండా 20 శాతం బోనస్ ఇవ్వాలన్నారు. సీ-4ఎల్, బీ-1ఎల్ గ్రేడ్లు వెంటనే తీసివేయాలని, వీఆర్ఎస్ స్కీం అమలు చేసి ఫైనల్ సెటిల్మెంట్ పునరుద్ధరించాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగ నియామకంలో సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చేయాలని, స్కిల్ మాట్రిక్స్ ప్రతి ఏడాది అమలు చేయాలని, 26 డ్యూటీలు ఇచ్చి వీక్లీ ఆఫ్ కు కూడా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం దీక్షా శిబిరాన్ని బీఆర్టీయూ నుండి సానికొమ్ము శంకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, ఏఐటీయూసీ నుండి సింగంనేని ప్రసాద్, బీఎంఎస్ నుండి బిజ్జం అశోక్ రెడ్డి, సీఐటీయు నుండి వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ నుండి యారం పిచ్చిరెడ్డి, గోనె రామారావులతో పాటు జిల్లా స్థాయి నాయకులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కాంట్రాక్టు కార్మిక సంఘ జేఏసీ నాయకులకు సంపూర్ణ మద్దతు తెలిపి వారి సమస్యలు పరిష్కరించేంతవరకు అండగా ఉంటామన్నారు. ఈ రిలేదీక్షా శిబిరంలో జేఏసీ మెంబర్లు వర్లగొండ వీరన్న, సింగారపు సతీష్, కదల వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, మేకల శేషమ్మ, రామశెట్టి లక్ష్మి, వీరంరెడ్డి సీతారామిరెడ్డితో పాటు పెద్ద ఎత్తున కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యలో భగత్‌సింగ్ వర్ధంతిని కార్మికులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్యలతో పాటు జేఏసీ నాయకులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిరుప్రాయంలోనే ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుని భగత్‌సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ కార్మికుల హక్కులను సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

‘కార్మికుల సమస్యలు ఐటీసీ యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలి’