బూర్గంపహాడ్, ఏప్రిల్ 24 : 13వ వేతన ఒప్పందం ముగిసి 24 రోజులు గడుస్తున్నా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ కర్మాగారంలోని అడ్మిన్ బ్లాక్ వద్ద 24 గంటల పాటు మహా ధర్నాను కార్మికులు ఎండను సైతం లెక్కచేయకుండా చేపట్టారు. యూనిట్లో కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు యాజమాన్యం స్పందించకపోవడం, గుర్తింపు సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా విసిగి వేసారి కార్మిక లోకం ఈ నిరసన ధర్నాతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్నాలో ఐఎన్టీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల కష్టార్జితంతో లాభాలు గడిస్తున్న యాజమాన్యం కార్మికుల కనీస అవసరాలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఏప్రిల్లో కొత్త వేతనంతో కూడిన జీతాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు యాజమాన్యం అటు గుర్తింపు సంఘం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో కార్మిక లోకం అయోమయానికి గురవుతుందని, మ్యాన్ పవర్ తగ్గించి పనిభారాన్ని పెంచాలనే ఆలోచన యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించవద్దని అటు గుర్తింపు సంఘం బాధ్యతను గుర్తుచేస్తూ మండిపడ్డారు. ఐటీసీ పరిశ్రమ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులు, ఆఫీస్ బేరర్స్, కార్మికులు పాల్గొన్నారు.