– కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతి
బూర్గంపహాడ్, జూన్ 22 : పినపాక ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలు విద్యాహక్కు చట్టం, పాఠశాల విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులను ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సామాజిక సేవకులు కర్నె బాబూరావు సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్య నిబంధనల ప్రకారం ఫీజు పెంచే ముందు తల్లిదండ్రుల కమిటీ ఆమోదం, డీఈవో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మణుగూరు మండల పరిధిలో పలు ప్రయివేటు పాఠశాలలు 25 శాతం నుంచి 50 శాతం వరకు ఏకపక్షంగా ఫీజులు పెంచుతున్నాయని, విద్యాహక్కు చట్టం సెక్షన్ 13(1) ప్రకారం ప్రతి పాఠశాలలో నోటీసు బోర్డుపై ఫీజు వివరాలు పెట్టాలని, కొన్ని పాఠశాలలు వీటిని పాటించకుండా ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్నాయని, కొన్ని పాఠశాలలు నిర్ధిష్ట పుస్తక స్టాల్స్‌తో కుమ్మక్కై తల్లిదండ్రులను అక్కడే పుస్తకాలు కొనుగోలు చేయాలని బలవంతపెడుతున్నాయని, మార్కెట్ ధర కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు పాఠశాలలపై తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, పుస్తక స్టాళ్లతో కుమ్మక్కైన స్కూళ్లు, స్టాల్స్‌పై విచారణ జరిపి లైసెన్స్‌లు రద్దుచేయాలని, అన్ని పాఠశాలల్లో ఫీజుల వివరాలు నోటీసు బోర్డుపై ప్రదర్శించేలా ఆదేశాలు జారీచేయాలని, డీఈవో జారీచేసిన సర్క్యులర్ ప్రకారం స్కూల్ యూనిఫాం, స్టడీ మెటీరియల్, పుస్తకాలను స్కూళ్లలో అమ్మకూడదన్న నిబంధన కఠినంగా అమలుచేయాలని, విద్యను వ్యాపారంగా మార్చకుండా తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.